: రాజ్యసభలో చర్చిస్తాం..నిలదీస్తాం..న్యాయం చేస్తాం: వెంకయ్యనాయుడు
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చిస్తామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ పదేళ్ళు రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించి ఎన్నికలకు ముందు బిల్లును తీసుకురావడంలో ఉద్దేశ్యం ఏంటని అడిగారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు సిగ్గు చేటని మండిపడ్డారు. లోక్ సభ ప్రసారాలు నిలివేయడం చీకటి రోజులను తలపించిందని ఆయన ఆక్షేపించారు.
బీజేపీని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మీ తీర్మానం వ్యతిరేకిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. బిల్లును చించేస్తామంటే ఏం చేశారని వెంకయ్యనాయుడు అడిగారు. కేంద్ర మంత్రులు లోక్ సభలో తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ఏం చేయగలిగారని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని ఆయన నిలదీశారు.
రాష్ట్ర విభజన అంశంపై డబుల్ గేమ్ ఆడుతున్నదెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ మంచి మనసుతో రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు తొలగాలని నిర్మాణాత్మక సూచనలు చేశామని ఆయన స్పష్టం చేశారు. తాము వ్యతిరేకించే ప్రమాదముందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఇచ్చిన సవరణలన్నీ తీరుస్తామని ఈ ఉదయం కూడా హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గొడవ జరిగితే బీజేపీ మీద తోసేద్ధామని కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పుడు బీజేపీది ద్వంద్వ ప్రమాణాలు అంటూ నాటకాలాడుతున్నారని వెంకయ్యనాయుడు మండిపడ్డారు. సభలో ప్లకార్డులు చించిందీ, సభ్యులతో కలబడిందీ కాంగ్రెస్ సభ్యులేనని ఆయన స్పష్టం చేశారు. దూరదర్శన్ ప్రసారాలను ఆపేసి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనకు మద్దతు తెలిపినా, విభజన జరిగిన విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. అద్వానీని తప్పుపట్టే దుస్సాహసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సవరణలు చేస్తామని అంటున్నారని, కానీ తాము కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని, రాజ్యసభలోకి బిల్లు వచ్చినప్పుడు సవరణలు ప్రతిపాదిస్తామని, నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ అని, భారత దేశంలో తెలంగాణ, సీమాంధ్ర రెండు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని, న్యాయం జరగాలని ప్రజాకోర్టులో పెడతామని వెంకయ్య నాయుడు హెచ్చరించారు.
రాష్ట్ర విభజన తరువాత ఏర్పడే పరిణామాలకు బాధ్యత వహించాల్సింది పార్లమెంటేనని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, హంద్రీనివా, వెలుగోడు, తెలుగు గంగ పూర్తి చేసే చట్టసవరణలకు పట్టుబడతామని తెలిపారు. తెలంగాణ, సీమాంధ్రులం సోదరులమని, ఆదర్శవంతంగా ఉండాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.