: వృద్ధాప్యం, మధుమేహాన్ని దూరం చేసే 'వండర్ పిల్'.. త్వరలో
మనిషికి అన్నీ అనుకూలిస్తే వృద్ధాప్యం కూడా ఆనందదాయకమే. ఆరోగ్యం, ఆర్ధిక లభ్యత ప్రతకూలిస్తే.. వృద్ధాప్యం కంటే దుర్భరమైనది మరొకటి ఉండదు. ఇక మధుమేహం విషయానికొస్తే ఆధునిక కాలంలో మనిషికి ప్రబల శత్రువు. జన్యు అమరిక, జీవనశైలి కారణంగా తలెత్తే ఈ ప్రమాదకర రుగ్మత ఇప్పుడు యువతనూ పట్టిపీడిస్తోంది. అయితే, వీటన్నింటికి చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు బర్మింగ్ హామ్ లోని ఆస్టన్ యూనివర్శిటీ పరిశోధకులు. తాము రూపొందిస్తున్న వండర్ పిల్ వార్థక్యం కారణంగా తలెత్తే రుగ్మతలను, మధుమేహాన్ని దూరం పెడుతుందని వివరించారు. ఇరిజిన్ అనే హర్మోన్ యుతమైన ఈ పిల్ బరువు తగ్గేందుకు విశేషంగా దోహదపడుతుందని, శరీర జీవక్రియలను వేగవంతం చేస్తుందని తెలిపారు. తద్వారా ఒబేసిటి ప్రమాదం కనిష్ఠ స్థాయికి పడిపోయి, టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయట. పైగా, ఈ పిల్ తో శరీరంలో పేరుకున్న కొవ్వు ఎప్పటికప్పుడు శక్తిగా మారుతుందని, తద్వారా వృద్ధాప్యమూ అంత త్వరగా దరిచేరదని పేర్కొన్నారు.