: ఈ బిల్లు చరిత్ర లిఖిస్తుంది.. జాతీయ పార్టీలు కళ్లు తెరవాలి: అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు దేశ రాజకీయాల్లో చరిత్ర లిఖిస్తుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఇప్పటికైనా జాతీయ పార్టీలు కళ్లు తెరిచి తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని ఆయన సూచించారు. కర్ణుడిలా బీజేపీ పోరాడాల్సిన అవసరం ఉందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సూచించారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం కలసి ఉంటేనే మంచిదని సీమాంధ్రులతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు.
కులాలు, మతాలు, డబ్బు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. మరోసారి ఉద్యోగులు జీతాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులంతా రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సమ్మె చేస్తుండగా లేనిది.. నేతలు కళ్లు ముసుకుని కూర్చుంటే ఎలా అని అన్నారు.
బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు మాని దేశ ఐక్యతను దృష్టిలో ఉంచుకోవాలని అశోక్ బాబు హితవు పలికారు. కర్ణుడు చేసిన ధర్మయుద్ధంలా బీజేపీ న్యాయబద్ధమైన పాత్ర పోషించాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో రాజకీయ వ్యవస్థకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని అశోక్ బాబు తెలిపారు.