: సోనియా, రాహుల్ కి ఆంధ్రప్రదేశ్ వెళ్లే దమ్ములేదు: మోడీ
కర్ణాటక రాష్ట్రానికి రావడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీలకు తీరిక ఉంది కానీ, ఆంధ్ర ప్రదేశ్ వెళ్లడానికి మాత్రం దమ్ములేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రావణ కాష్టం చేసిందని మండిపడ్డారు. సీమాంధ్రుల చిన్న చిన్న కోరికల్ని కూడా తీర్చలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఆయన గుర్తు చేశారు. అలాంటి ఆంధ్రప్రదేశ్ కే కాంగ్రెస్ పార్టీ కష్టాలు మిగిల్చిందని అన్నారు. ప్రజల కష్టాలను కూడా తీర్చలేనంత అహంకారంతో కాంగ్రెస్ పార్టీ నిండిపోయిందన్నారు. అలాంటి అధికార అహంకారులనుంచి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని మోడీ సూచించారు. కర్ణాటకలోని దావణగెరెలో ఈ రోజు ఆయన భారీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ నుంచి దేశాన్ని రక్షించాల్సిన సమయం ఆసన్నమైందని మోడీ తెలిపారు. కాంగ్రెస్ నేతలకున్న అధికార దాహం దేశాన్ని నాశనం చేస్తుందని మండిపడ్డారు. మనకి భారత దేశం తల్లిలాంటిదైతే, కాంగ్రెస్ పార్టీకి దేశం అధికారాన్ని చేపట్టే సాధనం అని విమర్శించారు. ఒక వైపు ఆకాశంలో ఎండల వేడి పెరుగుతోంటే, మరోవైపు దేశంలో రాజకీయం వేడెక్కుతోందని అన్నారు.