: శంషాబాద్ లో మరో ఇద్దరు ‘బంగార్రాజు’లు దొరికిపోయారు


దుబాయ్ విమానంలో బయల్దేరి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన మరో ఇద్దరు ‘బంగార్రాజు’లు దొరికిపోయారు. బంగారానికి సుంకం చెల్లించకుండా ఇక్కడకు తీసుకువచ్చి.. చివరకు కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు. ఓ వ్యక్తి నుంచి 467 గ్రాముల బంగారం, మరో వ్యక్తి నుంచి 465 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.

కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. కేరళకు చెందిన మహ్మద్ ఇక్బాల్ (28) ఏఐ 952 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి లగేజిలో పన్నెండు బ్రాలు కనిపించడంతో అధికారులు వాటిని నిశితంగా పరిశీలించగా, 24 తెలుపు రంగు తీగలను కనుగొన్నారు. ఇక్బాల్ బంగారు తీగలకు వెండి పూత పూసి లో దుస్తుల్లో దాచిపెట్టినట్లు గుర్తించారు. దీంతో 467 గ్రాముల బరువున్న బంగారు తీగలను అధికారులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అదే విమానంలో వచ్చిన షేక్ జలీల్ సుమారు 465 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలను ధరించాడు. వాటికి సంబంధించి అతడి వద్ద ఎలాంటి బిల్లులు లభించకపోవడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ రెండు ఘటనల్లో సుమారు 28 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News