: స్వలింగ సంపర్కం అంటే ఒబామాకు అంత గౌరవం ఎందుకో?
స్వలింగ సంపర్కం అసహజం, ప్రకృతి విరుద్ధమని ఎక్కువ మంది భావిస్తుంటారు. సృష్టి క్రమాన్ని ముందుకు తీసుకెళ్లే స్త్రీ, పురుష సాంగత్యానికి విరుద్ధమైన చర్యలను ఎక్కువ మంది ఆమోదించడం లేదు. ఆమోదిస్తే అది ఎటువంటి విపరిణామాలకు దారితీస్తోందోనన్న భయం ఒకటి ఉంది. కానీ, కొన్ని దేశాలు స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో పెద్దన్న అమెరికా కూడా ఒకటి.
అయితే అగ్రరాజ్యం అనే పేరుంది కదా.. తా చెడ్డ కోతి వనమల్లా చెరిచినట్టు .. ఇతర దేశాలు ఎలా ఉండాలో కూడా అమెరికానే నిర్దేశిస్తుంది మరి. ఉగాండాలో స్వలింగ సంపర్కాన్ని నేరమయం చేస్తూ ఒక బిల్లు తెచ్చేందుకు ఆ దేశ అధ్యక్షుడు యోవేరి ముసెవెని ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ.. ఒబామా హెచ్చరిక ప్రకటన జారీ చేయడమే విడ్డూరం. ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని, దాన్ని, ఆమోదిస్తే ఆ దేశంతో సంబంధాలకు విఘాతం కలుగుతుందని ఒబామా హెచ్చరించారు.
వారాంతపు విడిదిలో భాగంగా క్యాలిఫోర్నియాలో ఉన్న ఒబామా ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. ఉగాండా నేత ప్రయత్నాలతో తాను తీవ్ర అసంతృప్తికి లోనయ్యానని చెప్పారు. 'ఎక్కడైనా సరే ప్రజలందరినీ సమానంగా చూడాలి. వారందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. వారి ఎదుగుదలను అడ్డుకోరాదు. వారు ఎవరిని ప్రేమిస్తారు, ఇష్టపడతారు అన్నది ప్రశ్నే కాదు' అని పేర్కొన్నారు. నిజమే సమాజంలో అందరికి సమాన అవకాశాలు ఉండాలి. కానీ, స్వలింగ సంపర్కాన్ని అనుమతించడమే సమాన అవకాశాల్లో భాగమెలా అవుతుందో అన్న సందేహం మాత్రం కొందరిలో మిగిలి ఉంది. మరి స్వలింగ సంపర్కాన్ని భారత రాజ్యాంగం కూడా నేరమయంగా పరిగణిస్తోంది. సుప్రీంకోర్టు కూడా దీన్నే సమర్థించింది. మరి ఒబామా రేపు మనల్ని కూడా హెచ్చరిస్తారా?