: క్యాన్సర్ ను జయించాడు.. మారథాన్ గెలిచాడు


ఎన్ని మందులు వచ్చినా, క్యాన్సర్ అంటే ఇప్పటికీ ప్రాణాంతకమే. ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమే. వ్యాధి ముదిరితే అంతే సంగతులు. క్రీడాకారుల్లో కొందరు క్యాన్సర్  బారిన పడి కోలుకుని మళ్ళీ తమ ఆటలో విజేతలుగా నిలిచిన సంఘటనలు ఉన్నాయి. అమెరికా సైక్లిస్ట్ లాన్స్ ఆర్మస్ట్రాంగ్, టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ లు క్యాన్సర్ ను జయించినవాళ్ళే.

తాజాగా, ఓ పరుగువీరుడు క్యాన్సర్ ను సైతం లక్ష్యపెట్టకుండా, ఏకంగా మారథాన్ పోటీలో విజేతగా ఆవిర్భవించాడు. అతని పేరు ఇరామ్ లియాన్. అమెరికాలోని టెక్సాస్ కు చెందిన లియాన్ కు రెండేళ్ళ క్రితం బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారు. కోలుకునే క్రమంలో శ్రమకు గురిచేసే పనులేవీ చేయవద్దని వైద్యులు సూచించారు.

అయితే, అక్కడే అతనిలోని క్రీడాకారుడు మేల్కొన్నాడు. వెంటనే సాధన షురూ చేసి ఓ మారథాన్ పోటీలో పాల్గొన్నాడు. 'గుషేర్ మారథాన్-2013' పేరిట నిర్వహించిన ఈ బహుదూరపు పరుగులో లియాన్ దే ప్రథమస్థానం. ఇందులో ఓ విచిత్రముంది. లియాన్ ఒంటరిగా పరిగెత్తలేదు. తన ఆరేళ్ళ కూతురు కియానాను తోపుడు బండిలో కూర్చోబెట్టి దాన్ని నెట్టుకుంటూ పరుగు సాగించాడు.. ఫస్ట్ ప్లేసు కొట్టేశాడు.

దీంతో, మారథాన్ నిర్వాహకులు లియాన్ కుమార్తెకు 30 వేల డాలర్ల స్కాలర్ షిప్ అందివ్వాలని నిర్ణయించుకున్నారు. మామూలుగానే మారథాన్ గెలవడం కష్టమైతే, పాపతో సహా పరిగెత్తడం, అదీ క్యాన్సర్ తో బాధపడుతూ.. అసాధారణమే కదూ. పట్టుదల ఉండాలే కానీ, మనిషికి అసాధ్యమేదీలేదని మరోసారి నిరూపితమైంది. 

  • Loading...

More Telugu News