: "చేపలు తినొద్దండీ బాబూ" అంటున్న బాలీవుడ్ భామ
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఇష్టంగా తింటున్న మాంసాహారం చేపలు. అయితే ఇప్పుడు ‘‘చేపలు మన మిత్రులు.. అవి ఆహారం కాదు’’ అంటోందీ బాలీవుడ్ భామ. ముంబైలోని మహబూబ్ స్టూడియోలో జరిగిన పెటా వెజిటేరియన్ యాడ్ లో సముద్ర తీరంలో ఉన్న మత్స్యకన్య రూపంలో ఫోజిచ్చిన బాలీవుడ్ నటి రిచా చద్దా సైతం ‘‘చేపలు తినొద్దండి బాబూ’’ అంటూ సినీ ప్రేక్షకులకు పిలుపు ఇస్తోంది. జంతు సంరక్షణ సంస్థ పెటా ప్రచార బాధ్యతలు స్వీకరించిన చద్దా, ఆ సంస్థ నిర్మిస్తున్న ఈ శాకాహార ప్రచార ప్రకటన (యాడ్)లో మత్స్యకన్య రూపంలో కనిపించనుంది.
సినీ ప్రేక్షకులు రిచా చద్దా అందమైన రూపాన్ని మాత్రమే ఆస్వాదిస్తారో.. లేక ‘‘చేపలు మనుషుల మిత్రుల’’ని చెబుతున్న ఆమె మాటలను పట్టించుకుంటారో తెలియాలంటే ఆ యాడ్ విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే! ఈ విషయంలో మనుషుల సంగతి పక్కన పెడితే.. చేపలకే కనుక మనిషి భాషను అర్థం చేసుకునే శక్తి ఉంటే.. ఈ మాటలను, ఆ ప్రకటనను చూసి తెగ మురిసిపోతాయేమో కదా!