: డైలమాలో యువరాజ్
ఇటీవలే ఐపీఎల్ వేలంలో కళ్ళు చెదిరే ధర పలికిన డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యువీని రూ.14 కోట్లు పోసి కొనుక్కున్న సంగతి తెలిసిందే. అయితే, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులు యువీకి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. విషయం ఏమిటంటే.. బెంగళూరు ఫ్రాంచైజీ యజమాని విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాల కారణంగా మూతపడింది. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో మాల్యా చేతులెత్తేశాడు. దీంతో నెలల తరబడి జీతాలు అందక కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులు రోడ్డునపడ్డారు.
తాజాగా, మాల్యా కంపెనీ యువీని భారీ మొత్తానికి చేజిక్కించుకోవడంతో వీరి దృష్టి ఇటు మళ్ళింది. ఇప్పటికే సంఘటితమైన ఆ ఉద్యోగులు యువీని అర్థిస్తూ ఓ లేఖ రాశారు. బెంగళూరు ఫ్రాంచైజీకి ఆడొద్దని వారు యువీని కోరారు. తమకు నైతిక మద్దతునిస్తూ ఒప్పందం రద్దు చేసుకోవాలని వేడుకున్నారు. దీనిపై ఈ స్టయిలిష్ క్రికెటర్ స్పందన తెలియాల్సి ఉంది. చూస్తూ చూస్తూ యువరాజ్ పద్నాలుగు కోట్లు వదులుకుంటాడా? అనేది సందేహమే!