: లగడపాటి, కావూరిలకు దేశ బహిష్కరణ విధించాలి: టీడీపీ నేత ఎర్రబెల్లి
కేంద్రం, రాష్ట్రంలో అధికారం ఉన్నా, తెలంగాణపై కాంగ్రెస్ నాటకాలాడుతోందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈరోజు (శనివారం) ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఘటనకు బాధ్యులైన లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావులకు దేశ బహిష్కరణ విధించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కేటీఆర్ తో కలిసి వెళ్లి కేసీఆర్ సోనియాగాంధీని కలిశారని, వారు ఏం మాట్లాడారో చెప్పాల్సిన అవసరముందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ చేసుకున్న రహస్య ఒప్పందమేమిటో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా కేసీఆర్ నాటకాలను కట్టిపెట్టాలని ఆయన హితవు పలికారు.