: ఢిల్లీలో పోటీచేసుకో.. పనబాకపై ఆంధ్రా మేధావుల సంఘం ఫైర్
లోక్ సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టలేదని సుష్మా స్వరాజ్ అంటుంటే... సీమాంధ్రకు చెందినదై ఉండి కూడా, సభలో బిల్లును ప్రవేశపెట్టడం తాను చూశానని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వ్యాఖ్యానించడంపై ఆంధ్రా మేధావుల సంఘం నేత చలసాని శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. రాష్ట్రం ముక్కలవుతున్న పరిస్థితుల్లో కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. కొంతమంది ఎంపీలు, కేంద్ర మంత్రులు స్వలాభం కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. మరో రెండు నెలల్లో పోయే అధికారం కోసం, చరిత్ర హీనులుగా మిగిలిపోకూడదని సూచించారు. ఇలాంటి వారంతా సీమాంధ్రలో కాకుండా, ఢిల్లీలో పోటీ చేసుకోవాలని అన్నారు. పెప్పర్ స్ప్రే ఘటన మంచిది కాదని... కానీ, దాడులను ఎదుర్కోవడానికే లగడపాటి ఈ పని చేశారని చెప్పారు. సీమాంధ్ర ఎంపీలపై లోక్ సభలో పద్మవ్యూహం పన్నారని ఆరోపించారు. ఇప్పటి దాకా ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని బయటపెట్టకపోవడం కాంగ్రెస్ పార్టీ కుట్రలకు నిదర్శనమని తెలిపారు.