: సమ్మక్క-సారక్క ప్రసాదం కోసం పోటీపడుతున్న భక్తులు
వరంగల్ జిల్లా ‘మేడారం మహా జాతర’ వైభవంగా సాగుతోంది. గత మూడు రోజులుగా ఘనంగా జరుగుతోన్న జాతరకు ఇప్పటి వరకు 90 లక్షల మంది హాజరయ్యారు. గిరిజన దేవతలైన సమ్మక్క, ఆమె కూతురు సారక్కలు మేడారంలో శుక్రవారం ఉదయమే గద్దెలపై కొలువుదీరారు. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు ప్రతి రెండేళ్లకొకమారు జరిగే జాతరలో సమ్మక్క-సారక్కలకు మొక్కులు చెల్లించుకొనేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి గిరిజనులు ఇక్కడకు వస్తారు. గద్దెలపైనే కొలువుదీరిన వీరిని ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు దర్శించుకొనే వీలుందని ఆలయ పూజారులు తెలిపారు. అయితే, ఆదివారం నాడు కూడా జాతర కొనసాగుతుందని ఆలయ పూజారులు తెలిపారు. మేడారం జాతర తుది ఘట్టానికి చేరుకుంది. చివరి రోజైన ఈరోజు రాత్రి వరకు సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తటంతో మేడారం జనసంద్రంగా మారింది. సమ్మక్క, సారక్క గద్దెల వద్ద ప్రసాదం తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు.