: దేశం నుంచి విడిపోతాం.. సీమాంధ్రులకు ప్రత్యేక పార్లమెంటు ఇవ్వండి: సీమాంధ్ర ఎంపీలు
తమను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడాన్ని సీమాంధ్ర ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ప్రాంతానికి న్యాయం చేయలేనప్పుడు... సీమాంధ్రలోని 25 మందికి ప్రత్యేక పార్లమెంటు ఏర్పాటు చేయాలని, తాము దేశం నుంచి విడిపోతామని ఆక్రోశం వెళ్లగక్కారు. ఎంపీలు మోదుగుల, సుజనాచౌదరి, సీఎం రమేష్ లు మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. తన్నులు తిన్న ఎంపీలనే పార్లమెంటు నుంచి ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు. మా సస్పెన్షన్ ను ఎత్తివేసి, స్పీకర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాగా తాము విడిపోతామని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు తనపై దాడిచేస్తున్నప్పుడు జగన్ ఎందుకు అడ్డురాలేదని మోదుగుల ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ బిల్లును సభలో ప్రవేశపెట్టలేదని అంటుంటే... జగన్ పత్రిక మాత్రం బిల్లును సభలో ప్రవేశపెట్టారని ఎందుకు రాసిందని నిలదీశారు. పార్లమెంటులో జరిగిన వ్యవహారంలో ప్రథమ ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి స్పీకర్, మూడో ముద్దాయి జగన్ అని ఆరోపించారు.