: సీమాంధ్ర ఎంపీలపై ముజఫర్ పూర్ కోర్టులో కేసు
రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు పలువురు సీమాంధ్ర ఎంపీలు వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాంతో, 21 మంది సీమాంధ్ర ఎంపీలపై బీహార్ లోని ముజఫర్ పూర్ కోర్టులో దేశద్రోహం కేసు నమోదైంది. భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠ పాలు చేసినందుకు ఎంపీలపై ఐపీసీ సెక్షన్లు 504, 323, 124బి, 30బి కింద కేసు నమోదైంది. సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు ఫైల్ చేశారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలొ సీమాంధ్రకు చెందిన ఎంపీలు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా ఉందని, తోటి సభ్యులపై పెప్పర్ స్ప్రేను ఉపయోగించి నిండు సభలో అల్లకల్లోలం సృష్టించినందుకు ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, పిటిషన్ పై విచారణను కోర్టు మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.