: చాయ్ తో నాలుగు లాభాలు
కాఫీతో తిప్పలు తప్పవని హెచ్చరించేవారుంటారుగానీ, టీ తాగితే సమస్యలొస్తాయని ఎవరూ చెప్పబోరు. అలాంటి ఈ పానీయంతో నాలుగు రకాల లాభాలున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వ్యాధుల బారిన పడకుండా కాపాడడం, బరువు పెరగకుండా నియంత్రించడం, ఒత్తిడి తగ్గించడం, చర్మానికి మెరుపునివ్వడం.. ఇవన్నీ టీ ద్వారా సమకూరే లాభాలని వారు తెలిపారు. ముఖ్యంగా.. హృదయ సంబంధ వ్యాధులనుంచి ముప్పును తగ్గిస్తుందట. క్యాన్సర్లు, పార్కిన్సన్ వ్యాధి నుంచి రక్షిస్తుందని, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచి ప్రయోజనకారి అని సదరు అధ్యయనం వెల్లడిస్తోంది.
మనం పాలు, స్వీటెనర్ వంటి ద్రవాలు కలిపితే తప్ప టీ కెలోరీ రహితమని, తద్వారా బరువు తగ్గొచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఇక టీ లో ఉండే థియనైన్ అనే ఎమినో ఆమ్లం ఒత్తిడి తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందట. చర్మ సంరక్షణకు విశేషంగా తోడ్పడే ఎలాస్టిన్, కొలాజిన్ అనే పదార్థాలను పెంపొందించడం ద్వారా మేని నిగారింపుకు సహకరిస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది.