: ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇకపై క్యూ కట్టాలేమో?
సాహసికులను మరింత మందిని ఎవరెస్ట్ శిఖరంపైకి ఆకర్షించేందుకు నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతి విదేశీ పర్వతారోహకుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే ఫీజుగా 25 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ.15.5లక్షలు) చెల్లించాల్సి ఉంది. దాన్ని వచ్చే ఏడాది నుంచి 11వేల డాలర్లకు తగ్గిస్తున్నట్లు టూరిజం శాఖ అధికారి తిలక్ రాం పాండే తెలిపారు. ఈ రేట్లు కూడా రద్దీ సీజన్ లో ఈశాన్య, దక్షిణ మార్గం నుంచి శిఖరాన్ని ఎక్కేవారికే వర్తిస్తాయన్నారు.
ఇతర సమయాల్లో వేరే మార్గాల ద్వారా ఎక్కే వారి నుంచి 2,500 డాలర్లు మాత్రమే వసూలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు విడిగా ఒక్కో పర్వాతారోహకుడు భారీగా ఫీజు చెల్లించాల్సి వస్తుండడంతో ఏడుగురు సమూహంగా ఏర్పడి 70వేల డాలర్లు చెల్లించి అనుమతి పొందుతున్నారు. దీన్ని నివారించడంతోపాటు, నిజమైన సాహసికులను మరింత మందిని ఎవరెస్ట్ వైపు నడిపించేందుకు నేపాల్ అధికారులు తాజా నిర్ణయాలు తీసుకున్నారు.