: తమిళనాట 'అమ్మ' మెడికల్ షాపులు
తమిళనాడు సర్కారు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను ఆకట్టుకునేందుకు బడ్జెట్ లో రాయితీ పథకాలకు పెద్దపీట వేసింది. ఇంతకుముందు సీఎం జయలలిత పేరిట రూపాయికే ఇడ్లీ అంటూ అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్.. ఇలా పలు పథకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటి బాటలోనే 'అమ్మ మరుందగమ్' పేరిట చవక ధరలకు ఔషధాలమ్మే మెడికల్ దుకాణాలు తెరవాలని ఏఐఏడీఎంకే ప్రభుత్వం నిశ్చయించింది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.289 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వన్ అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా 'అమ్మ ఫార్మసీ' వివరాలు వెల్లడించారు.
అంతేగాకుండా, 35 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు సరఫరా చేసేందుకు ఉద్ధేశించిన పథకానికి రూ.2000 కోట్లు.. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ ల పథకానికి రూ.1100 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి పన్నీర్ సెల్వమ్ సభకు తెలిపారు.