: సైఫ్ అలీఖాన్ ఆఫీసులో ఏసీలు దొంగిలించిన ఉద్యోగులు అరెస్టు
ముంబయిలోని ఖర్ ప్రాంతంలో ఉన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఫ్రొడక్షన్ కార్యాలయం 'ఇల్యూమినాటి ఫిల్మ్స్' లో పదకొండు ఏసీలను దొంగిలించిన ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఖర్ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ, రెండు రోజుల కిందట (బుధవారం) ఖాన్ ప్రొడక్షన్ మేనేజర్ తమను కలిసి రెండు నెలల కిందట జరిగిన ఏసీల దొంగతనం గురించి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ క్రమంలో ముందుగా ఖాన్ కార్యాలయంలోని ఉద్యోగులందరినీ ఒక్కొక్కరుగా విచారించామని, వారిలో ఇద్దరిని అనుమానించి మరింత ప్రశ్నించడంతో తామే దొంగతనం చేసినట్లు ఒప్పకున్నారని పోలీస్ అధికారి వెల్లడించారు. తమ ఇంటిలో ఆర్థిక సమస్యల కారణంగానే ఈ నేరానికి పాల్పడినట్లు ఉద్యోగులు చెప్పారని, అందులో ఒక వ్యక్తి తన సోదరి పెళ్లికోసం ఇలా చేసినట్లు చెప్పాడన్నారు. వారిపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.