: శుక్రవారం నాడు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి తెప్పోత్సవం
ప్రతీ ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున వైభవంగా నిర్వహించే మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమాన్ని 14వ తేదీన (శుక్రవారం) గుంటూరు జిల్లాలోని ఉండవల్లి కృష్ణానదిలో నిర్వహించనున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా పౌర్ణమి రోజున ఉదయం 6 గంటలకు మంగళగిరి నుంచి సీతానగరంలోని సీతారామ ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు తీసుకువస్తారు. సీతానగరంలోని ఆలయంలో స్నపన తిరుమంజనోత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 3 గంటల సమయంలో స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ఊరేగింపుగా ఉండవల్లి రేవుకు తీసుకువస్తాయి. ఉండవల్లి రేవులో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవార్లను అధిరోహింపజేస్తారు. ఉండవల్లి రేవు నుండి నదికి ఆవల ఉన్న కృష్ణాజిల్లా పరిధిలో గల విజయవాడ కనకదుర్గ ఘాట్ వరకు తెప్పోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. కనకదుర్గ ఘాట్ లో భక్తుల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి, తిరిగి సీతానగరం ఆలయానికి తీసుకువస్తారు.