: ‘మెట్రోపోలిస్’ సదస్సు కోసం 100 కోట్ల అభివృద్ధి పనులు: మేయర్ మాజిద్ హుస్సేన్
హైదరాబాదులో వచ్చే అక్టోబరులో జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సును పురస్కరించుకుని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వసతుల కల్పన తదితరాల కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిధుల నుంచి 100 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు హైదరాబాదు మేయర్ మాజిద్ హుస్సేన్ తెలిపారు. మెట్రోపొలిస్ సదస్సు కోసం 60 దేశాల్లోని 136 నగరాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని, ఈ సదస్సు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన చెప్పారు. మెట్రోపొలిస్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు నగరానికి వచ్చిన మెట్రోపొలిస్ ప్రతినిధులతో కలిసి మేయర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాదు సంస్కృతీ సాంప్రదాయాలు, జీవన వైవిధ్యం, నగరీకరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సదస్సును హైదరాబాదును ఎంపిక చేసినట్లు మెట్రోపొలిస్ ప్రతినిధులు అలైన్ లెసాస్, సునీల్ దుబే, అజయ్ సూరి తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు.