: దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, కేంద్రమంత్రులను బహిష్కరించండి: సుష్మాస్వరాజ్
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, కేంద్రమంత్రులను బహిష్కరించాలని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. సభలో ఈ రోజు జరిగిన అన్ని ఘటనలకు కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామానే అని చెప్పారు. ఇంత గందరగోళం మధ్య తెలంగాణ బిల్లు ఆమోదం మంచిది కాదని ప్రధానికి చెప్పామని తెలిపారు. లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టినట్టు తాము భావించడం లేదని అన్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు మాకు ఎలాంటి సమాచారం కూడా లేదని చెప్పారు. ఇకపై తాము ప్రభుత్వంతో ఎలాంటి చర్చలను జరపమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మా సలహాలను అడగడమే కాని, ఆచరణలో పెట్టడం లేదని విమర్శించారు.