: బీజేపీ ఎటు వైపు.. ఏం చేస్తుంది?
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేందుకు సమయం ఖరారైంది. బిల్లును ఎప్పట్లానే సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తుండగా, తెలంగాణ నేతలు మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల నేతలు బీజేపీపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టడం వెనుక బీజేపీ వ్యాఖ్యలు పని చేశాయనేది నిర్వివాదాంశం. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చినా ఇవ్వకున్నా బీజేపీ ఇచ్చితీరుతుందని.. సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించిన తరువాతే.. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ వాయువేగంతో పనిచేసి బిల్లు తెచ్చింది.
అయితే, ఆది నుంచి తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న బీజేపీ, తాజాగా, సీమాంధ్రులకు న్యాయం చేయాలని కోరడంతో, ఆ ప్రాంత నేతలు ఆ పార్టీపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్లమెంటులో ఆ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోందనేదే ఆసక్తి రేపుతోంది. తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని బీజేపీ చాలా కాలంగా చెబుతోంది. అలాగే నిన్న పార్లమెంటులో అంత గందరగోళం జరిగినా బీజేపీ ఘాటుగా స్పందించలేదు. అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలా చోద్యం చూసింది. సభలో అభ్యంతరం చెప్పలేదు సరికదా, కనీసం ఖండించలేదు. లోక్ సభ బయట మాత్రం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు.
అవసరమైతే సీమాంధ్ర కేంద్ర మంత్రులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క ప్రధాని విందు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోంది. సవరణలు సూచించి తెలంగాణ బిల్లును ఆమోదించేందుకు అంగీకరించినట్టు సమాచారం. కాగా సీమాంధ్ర నేతలు మాత్రం బీజేపీ ఏం చేస్తుందో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో పార్లమెంటులో బీజేపీ నేతలంతా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సీమాంధ్ర ఎంపీలను, కేంద్ర మంత్రులను సస్పెండ్ చేస్తే అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఏది ఏమైనా, బీజేపీ వ్యవహారశైలిపై సర్వత్ర అత్యంత ఆసక్తి నెలకొంది.