: మంత్రి మహీధర రెడ్డితో మున్సిపల్ సిబ్బంది చర్చలు సఫలం


హైదరాబాదులో ఈరోజు (బుధవారం) సాయంత్రం మంత్రి మహీధరరెడ్డితో పురపాలక కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలమవటంతో మున్సిపల్ సిబ్బంది సమ్మెకు పుల్ స్టాప్ పడనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) పరిధిలో పనిచేసే కార్మికులకు 27 శాతం, మిగతా నగర పాలక సంస్థల్లో 23 శాతం ఐ.ఆర్ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే పురపాలక సంఘాల్లో పనిచేసే కార్మికులకు 9 శాతం ఐ.ఆర్ ను ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విశాఖ, గ్రేటర్ విజయవాడల్లో ప్రత్యేక అలవెన్సు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా ప్రభుత్వం తెలిపింది.

కనీస వేతనాలు 12,500 రూపాయలకు పెంచాలన్న ప్రధాన డిమాండ్ తో ఆరు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సహా మున్సిపల్ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె ప్రభావంతో జంటనగరాల పరిధిలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దీంతో, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందంటూ జీహెఛ్ఎంసీ నగర మేయర్ మాజిద్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని, లేదంటే ఎస్మా ప్రయోగించేందుకైనా సిద్ధమని మేయర్ ప్రకటించినా మున్సిపల్ సిబ్బంది వెనక్కు తగ్గలేదు. చివరకు, ప్రభుత్వం దిగివచ్చి మున్సిపల్ సిబ్బందితో సంప్రదింపులు జరిపి వారి డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించింది.

  • Loading...

More Telugu News