: తెలుగు ప్రజల మధ్య హింసను ప్రేరేపించకండి: జేపీ
తెలుగు ప్రజల మధ్య హింసను, ఆందోళనలను, ఉద్రిక్తతలను పెంచవద్దని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సూచించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల మధ్య తెలంగాణ బిల్లును ఆమోదించడం సరికాదని అన్నారు. సీమాంధ్రలో రైల్వే జోన్ కావాలంటే ఆలోచిస్తామన్నారే కానీ చేద్దామనలేదని ఆయన మండిపడ్డారు. తాము స్పష్టంగా ఎలా చేస్తే సామరస్యంగా సమస్య పరిష్కారం అవుతుందో తెలిపామని, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏ కోశానా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్య మరింత తీవ్రం చేయవద్దని ఆయన సూచించారు. నేతలంతా రాజకీయ స్వార్థం కోసం మాట్లాడుతున్నారు తప్ప నిర్మాణాత్మకంగా కృషి చేయట్లేదని ఆయన అన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో పాలన పడకేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలు గ్రహించి, రెండు ప్రాంతాల నేతలతో, ప్రజా సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని జేపీ సూచించారు.