: లంక వ్యవహారంపై త్వరలో అఖిలపక్ష సమావేశం
లంక తమిళుల సమస్యపై రగిలిపోతున్న డీఎంకే.. యూపీఏ నుంచి వైదొలిగిన నేపథ్యంలో కేంద్రం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. త్వరలోనే ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ భేటీలో.. అమెరికా ఐరాస మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టబోయే లంక వ్యతిరేక తీర్మానంపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిఫై చర్చిస్తారు.
అమెరికా తీర్మానానికి భారత్ మద్దతు పలకడంతో పాటు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సను యుద్ధ నేరస్తుడిగా నిలబెట్టేందుకు కృషి చేయాలని డీఎంకే కోరుతోంది. అయితే, అమెరికా ప్రవేశపెట్టబోయే తీర్మానం తుది ముసాయిదాను పరిశీలించాకే తమ వైఖరి నిర్ణయించుకోవాలని కేంద్రం భావించడం డీఎంకేను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో, డీఎంకే.. యూపీఏకి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.