: అధిష్ఠానానికి అన్ని విధాలా చెప్పాం: కావూరి
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, సీనియర్ నేతలకు, పార్టీ ముఖ్య నేతలకు అందరికీ వాస్తవాలు వివరించామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విభజన ఎలా చేయాలో అందరికీ తెలిపామని, సీమాంధ్రులకు న్యాయం చేయాలని చాలా సార్లు సూచించామని అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తమ విజ్ఞప్తిని కనీసం పట్టించుకోలేదని ఆయన అన్నారు. దేశం ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఎలా పోయినా తమకు సంబంధం లేదనేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తాను ప్రాంతీయ వాదిని కాదని దేశ సమైక్యవాదినని కావూరి స్పష్టం చేశారు. భవిష్యత్ గురించి చెప్పడానికి మనం ఎవరం? అని ఆయన ప్రశ్నించారు. రేపు ఏం జరుగుతుందో రేపే చూడాలని ఆయన సూచించారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని ఏర్పాటు చేయాలంటే అందుకు చక్కని ప్రణాళిక ఉండాలని.. అంతవరకు హైదరాబాద్ ను పదేళ్ల ఉమ్మడి రాజధాని చేయాలని.. అది కూడా చట్టబద్ధంగా ఉండాలని.. తాము కోరామన్నారు. తమ వాదనలను కానీ, తమ డిమాండ్లను కానీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.