: రాష్ట్రంలో ఇద్దరు టీ విక్రయదారులతో మోడీ నేడు మాటామంతీ
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నేడు దేశవ్యాప్తంగా టీ విక్రయదారులతో మాట్లాడనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,000 టీ స్టాళ్లలో మోడీ చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోడీ రాజకీయాల్లోకి రాకముందు టీ అమ్ముకుని జీవనం సాగించిన విషయం తెలిసిందే. దాన్ని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. దాన్నే ఆయుధంగా చేసుకుని లబ్ధి పొందాలని బీజేపీ ఇలా ప్రచార కార్యక్రమం చేపట్టింది.
దీనిలో భాగంగా మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా పలు టీ స్టాళ్ల వారితో మాట్లాడతారు. ఇందుకు వీలుగా అక్కడ టీవీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొత్తం 108 టీ స్టాళ్లలో ఈ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒకరు, గుంటూరులో ఒక టీ స్టాల్ యజమానితో మోడీ మాట్లాడనున్నారు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 30 మంది చాయ్ వాలాలకు అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఇది జరుగుతుంది. దీన్ని http://www.yuva4india.tv/ లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి బీజేపీ ఏర్పాట్లు చేసింది.