: సీఎం రాజీనామా ఖాయం..ఎంపీల సస్పెన్షన్ దారుణం: మంత్రి పితాని
లక్ష్యం కోసం పోరాడుతున్న ఎంపీలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం దారుణమని మంత్రి పితాని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో ఎంపీలపై ప్రజల్లో అమాంతం అభిమానం పెరిగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు కాంగ్రెస్ ను అధఃపాతాళానికి తీసుకుపోతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ముందుకు వెళ్తుంటే ఆయనతో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు పార్టీని వీడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరవాలని ఆయన సూచించారు.