: అది తెలంగాణ, సీమాంధ్ర ప్రజల సమస్య కాదు.. రాజకీయ సమస్య: జేపీ


రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్య తెలంగాణ, సీమాంధ్ర ప్రజలది కాదని, రాజకీయ సమస్య అని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తరువాత నెలకొనే అన్ని సమస్యలను కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలని అభిప్రాయపడ్డారు. పాలకులంతా హైదరాబాదుపైనే దృష్టి పెట్టడంతో రాష్ట్రంలో అభివృద్ధి అంతంత మాత్రంగా జరిగిందని అన్నారు.

కేవలం హైదరాబాదు నుంచి వచ్చే ఆదాయం అన్ని వ్యయాలు పోనూ 13వేల కోట్ల మిగులు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో 8,500 కోట్ల రూపాయల లోటు ఉందని అన్నారు. అలాగే రాయలసీమలో లోటు 8 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రలో కూడా అదే పరిస్థితి నెలకొందని ఆయన స్పష్టం చేశారు. సవ్యంగా ఉన్న అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి కేంద్ర ప్రభుత్వం తమాషా చూడకూడదని ఆయన హితవు పలికారు.

రాష్ట్రంలో అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక హోదా కల్పించి, భవిష్యత్ కి భరోసా ఇవ్వాలని జేపీ డిమాండ్ చేశారు. ఉపాధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. కర్నూలుకు హైదరాబాద్ తో సంబంధాలు ఉన్నాయని, ఆంధ్రాతో చాలా తక్కువ సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందువల్ల కర్నూలును హైదరాబాద్ లో కలిపితే బెంగళూరుకు రహదారి ఏర్పడి పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఏకాభిప్రాయం సాధించి సమస్యను పరిష్కరించాలని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును సాయంత్రం ఐదు గంటలకు కలుస్తామని తెలిపారు. ఆరు గంటలకు బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడుని కలుస్తామని అన్నారు. తరువాత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని, ఈ రోజు కానీ, రేపు ఉదయం కానీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను కలుస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అనేది అసాధ్యమైన సమస్య కాదని అన్నారు.

రాజకీయ లాభం చూసుకుంటే సమస్యలు పరిష్కారం కావని ఆయన తెలిపారు. లోక్ సత్తా సూచించిన విధంగా చేస్తే, రాష్ట్రం విడిపోయిన తరువాత మూడు ప్రాంతాల ప్రజల బ్రతుకులు బాగుంటాయని జేపీ వెల్లడించారు. అలా కాకుండా ఒకరివేలితో మరోకరు పొడుచుకుంటే అందరమూ గుడ్డివాళ్లమవుతామని జేపీ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News