: చెత్త ఎత్తడం మానేసి.. జీతాలు పెంచమని అడుగుతారా?: హైదరాబాద్ మేయర్ మండిపాటు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మూడు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. మున్సిపల్ సిబ్బంది తమ వేతనాలు కనీసం 12,500 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనతో పాటు మరికొన్ని డిమాండ్ లను కూడా జీహెచ్ఎంసీ ముందు ఉంచారు. అయితే, గ్రేటర్ అధికారులు స్పందించకపోవడంతో వారు విధులను బహిష్కరించి సమ్మె సైరన్ మోగించారు. ఎక్కడికక్కడ మున్సిపల్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలతో పారిశుద్ధ్య కార్మికులు రోజురోజుకూ తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. హైదరాబాదు నగర మేయర్ మాజిద్ హుస్సేన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో కార్మికులు పనిచేసి జీతాలు అడిగి తీసుకోవాలని.. అంతేగాని వేతనాలు పెంచాలంటూ సమ్మె చేయడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో రోజురోజుకూ చెత్త పేరుకుపోతోందని, అది ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. రేపటిలోగా పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో చేరకపోతే, తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మేయర్ హుస్సేన్ హెచ్చరించారు.