: ఇవాళ కూడా చెక్కులు పాసవ్వలేదు.. డీడీలు తయారుకాలేదు


మంగళవారం కూడా బ్యాంకుల తాళాలు తీయలేదు. చెక్కులు, డీడీలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జాతీయ బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో బ్యాంకు వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా.. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్.డి.ఎఫ్.సి సహా పలు ప్రైవేటు బ్యాంకులు యధావిధిగా కార్యకలాపాలు సాగించాయి. అయితే, అధిక శాతం ప్రజల ఖాతాలు జాతీయ బ్యాంకుల్లో ఉండటంతో వారికి వరుసగా రెండో రోజూ కష్టాలు తప్పలేదు.

వివిధ డిమాండ్ల సాధన కోసం యునైటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యు.ఎఫ్.బి.యు) రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విదితమే. దాంతో సోమవారం ప్రారంభమైన బ్యాంకుల సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. నగదు కార్యకలాపాలు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో, కొన్ని చోట్ల ఏటీఎంలు కూడా ఖాళీ కావడంతో చిరు వ్యాపారుల బాధలు వర్ణనాతీతం. 10వ వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని, బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాలు, కార్పొరేట్ సంస్థలకు కొత్తగా బ్యాంకింగ్ లైసెన్స్ ల జారీ వంటి సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఉద్యోగులు ఆయా బ్యాంకుల ముందు డిమాండ్ల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. అయితే, ఇప్పటికే నష్టాలతో నడుస్తోన్న దేశీయ బ్యాంకింగ్ రంగం ఈ సమ్మెతో మరింత నష్టపోతుందని వివిధ బ్యాంకుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

  • Loading...

More Telugu News