: మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతోన్న.. ‘మేడారం మహా జాతర’
మహాజాతరకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేడారం జాతరకు సమయం సమీపిస్తోంది. సారలమ్మ రాకతో ప్రారంభమయ్యే మహా ఘట్టానికి మేడారం ముస్తాబైంది. 12వ తేదీ (బుధవారం) నుంచి 15వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పరిసర ప్రాంతాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల పైకి తీసుకురావడంతో మహా జాతర మొదలవుతుంది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారం బాట పడుతున్నారు. కన్నెపల్లి, మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెం గ్రామాలు గుడారాలతో నిండిపోయి.. జనసంద్రంగా మారాయి.
సారలమ్మ పూజారులు గత బుధవారం నుంచే సారలమ్మ ఆలయంతో ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యారు. రేపు జరిగే మహాఘట్టానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు దేవాదాయ శాఖ కూడా మేడారం జాతరను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రప్రభుత్వం చేపట్టిన స్నానఘట్టాలు, కొత్త వంతెన, రహదారుల నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. జాతర ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతల్లో సోమవారం నుంచి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 14 వేల మంది సిబ్బంది తలమునకలయ్యారు. విద్యుత్ దీప కాంతులు, వాణిజ్య సముదాయాలతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి.