: వైద్యులు ఇవి పాటించాలి బాబులూ!: ఎంసీఐ
వందల రూపాయల ఫీజులు పిండుకుంటారు. ఎడాపెడా టెస్టులు రాసేస్తారు. రిపోర్టులను కనీసం పరీక్షగానూ చూడరు. క్షణాల్లోనే ఎదురుగా ఉన్న ప్యాడ్ పై పెన్నుతో పిచ్చి పిచ్చి రాతలో బరికేసి చేతిలో ప్రిస్క్రిప్షన్ పెడతారు. ఇదీ ఘనత వహించిన భారతీయ వైద్యుల మాయాజాలం.
వారు రాసిన మందుల పేర్లు మనకు అర్థమైతే ఒట్టు! బయట మందుల షాపుల వారికీ అర్థం కాని పరిస్థితి. గత్యంతరం లేక క్లినిక్ వద్దనున్న మందుల షాపులోనే కొంటాం. డాక్టర్ కు కమిషన్ వెళుతుంది. ఇలా రోగిని చీట్ చేసే విధానానికి తెరపడనుంది. ఇకపై వైద్యులు విధిగా ప్రిస్కిప్షన్ లో మందుల పేర్లను కేపిటల్ అక్షరాల్లోనే రాయాల్సి ఉంటుంది. వాటి పేర్లు, డోసేజీ స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి. ఈ మేరకు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. ఇందుకు త్వరలోనే ఆదేశాలను జారీ చేస్తామని ఎంసీఐ చైర్ పర్సన్ జయశ్రీబెన్ మెహతా తెలిపారు.
వైద్యులు కోడి కెలికిన రాతలో రాయడం వల్ల మధ్యలో ఒక అక్షరం మారినా మందులు మారి ప్రాణాపాయానికి దారి తీసే అవకాశాలు ఉంటాయని ఎంసీఐ కమిటీ అభిప్రాయపడింది. తాజా నిర్ణయాన్ని భారతీయ వైద్యుల సంఘం ఆహ్వానించింది. దీనివల్ల రోగులు తమకు వైద్యులు ఏం రాశారో తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.