: ఇవాళ అమర గాయకుడు ఘంటసాల వర్ధంతి
సరిగ్గా నలభై ఏళ్ల క్రితం, ఇక పాడలేనని ఆ కంఠం సెలవు తీసుకుంది. ఆ మనిషి, ఆ స్వరం ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆయన లేడు, ఆ స్వరమూ లేదు. కానీ, ఆయన పాటలను కొన్ని లక్షల కుటుంబాలు నాలుగు దశాబ్దాలుగా వింటూనే ఉన్నాయి. జీవితంలోని సమస్త సంతోషాలను, బాధలను, ప్రేమాభిమానాలను, కరుణ రస స్పందనలను ఆయన గీతాల ద్వారా వింటూ ఆంధ్రదేశం సేద తీరుతోంది. అందుకే.. ఆయన అమర గాయకుడయ్యాడు. ఆయనే ఘంటసాల వేంకటేశ్వరరావు!
చిన్న వయస్సులోనే హరికథలు పాడుతూ జనాన్ని మెప్పించిన ఘంటసాల, విజయనగరంలో వారాలు చేసి, సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. ఈ విశ్వంలో తెలుగు వాళ్లు కాలుమోపిన ప్రతి చోటా తన ఉనికిని పాట రూపంలో, పద్యం రూపంలో చాటుకుంటూ ఆయన చిరంజీవిగా నిలిచిపోయాడు. మూడు తరాల పాటు ఆంధ్రదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠంతో పరవశింపజేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల. నేపథ్యగాన చరిత్రలో.. చెరగని సంతకంలా తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయాడు ఆయన. ఫిబ్రవరి 11వ తేదీన ఘంటసాల వర్ధంతి సందర్భంగా.. ఆయనను స్మరించుకొంటూ, ఆయన పాట పలికించిన సహస్ర వ్యక్తీకరణలను భద్రపరుచుకుందాం.