: ఆకతాయిల వేధింపులకు బాలిక బలి
గుంటూరు జిల్లాలో ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. క్రోసూరు మండలం అనంతవరం గ్రామంలో పదవ తరగతి చదువుతున్న శ్రీలక్ష్మి అనే బాలికను ముగ్గురు యువకులు తరచూ వేధిస్తున్నారు. కొంతకాలంగా వేధింపులు మరీ శృతిమించి పోయాయి. గతరాత్రి ఓ యువకుడు శ్రీలక్ష్మి వద్దకు వచ్చి తనతో ఫోన్ లో మాట్లాడాలని బలవంతం చేశాడు. అదే సమయంలో బాలిక తండ్రి అక్కడికి రావడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. తన కారణంగానే పరువు పోయిందని భావించిన ఆ బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ నేడు మరణించింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీలక్ష్మి మృతికి ఆ ముగ్గురు ఆకతాయిలే కారణమని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలావుంటే, బాలిక చనిపో్వడంతో ముగ్గురు యువకులు గ్రామం వీడి పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.