: పాపం.. జింబాబ్వే క్రికెటర్లు!
క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు వెళితే సాదాసీదా హోటళ్ళలో బస.. సాధారణ భోజనం! ఇది ఏ జిల్లా క్రికెట్ జట్టు పరిస్థితో కాదు.. సాక్షాత్తూ జింబాబ్వే జాతీయ జట్టు వ్యథ. ఓవైపు దేశం ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండగా, మరోవైపు జింబాబ్వే క్రికెట్ బోర్డు నిధుల లేమితో ఇబ్బంది పడుతోంది. చివరికి ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజు కూడా చెల్లించలేని దైన్యస్థితిలో చిక్కుకుంది. దీంతో, ఆటగాళ్ళు మరోసారి సమ్మెబాట పట్టారు. తాజాగా, ఓ దేశవాళీ టి20 టోర్నీ మొదలవ్వాల్సి ఉండగా, బకాయిలు చెల్లిస్తేనే బరిలో దిగుతామని వారు బోర్డుకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆటగాళ్ళ సంఘాలతో బోర్డు చర్చలు జరిపి, బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అది ఇంతవరకు కార్యరూపం దాల్చకపోవడంతో ఆటగాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల జరగాల్సిన శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా సిరీస్ లు సైతం జింబాబ్వే బోర్డు ఆర్ధిక నిస్సహాయత రీత్యా రద్దయ్యాయి.