: బీజింగ్ ను తలదన్నిన ఢిల్లీ
చైనా రాజధాని బీజింగ్ ను భారతదేశ రాజధాని ఢిల్లీ తలదన్నింది. ఎందులో అనుకుంటున్నారు.. వాయు కాలుష్యంలో! ఢిల్లీలోని గాలిలో విషతుల్యమైన వాయవులు పెరిగిపోయాయి. కేన్సర్, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే వాయువులు ఎక్కువవుతున్నాయి. దీంతో పీల్చేందుకు స్వచ్చమైన గాలి ఢిల్లీలో మృగ్యమైపోయింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు నాలుగు నెలల కాలంలో ఢిల్లీలో కేవలం మూడు రోజులే పరిమిత స్థాయిలో వాయుకాలుష్యం ఉన్నట్లు తేలింది. అంటే, మిగతా అన్ని రోజులూ ప్రజలు విష వాయువులనే పీల్చారన్నమాట.
వాయు స్వచ్ఛత ఢిల్లీలో 2.5 గా నమోదైంది. ఇది ప్రమాదకర స్థాయి. వాయుకాలుష్యం కారణంగా పొగమంచు పెరిగిపోయింది. ఫలితంగా స్పష్టంగా కనిపించే పరిస్థితి లేదు. నిర్మాణాల నుంచి వెలువడే దుమ్ము, డీజిల్ వాహనాలు వెదజల్లే కాలుష్యమే దీనికి కారణం. బీజింగ్ లో కాలుష్య నివారణకు చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోగా, ఇక్కడ మాత్రం అవి లోపించాయి. కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ డైరెక్టర్ సునీతా నారాయణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సో, ఢిల్లీ ప్రపంచంలోనే విషపూరిత నగరాల్లో ఒకటిగా చేరిందన్నమాట!