: మోడీకి గూగుల్ ఘన స్వాగతం
మోడీకి దేశ రాజకీయాలలో రోజురోజుకీ పాప్యులారిటీ పెరిగిపోతోంది. తాజాగా ఈ నేతకు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. గురువారం (21న) గూగుల్ ఒక సదస్సు నిర్వహిస్తోంది. దీనిలో పాల్గొని ప్రసంగించాలంటూ మోడీని ఆహ్వానించింది. రాజకీయాలలో సాంకేతికత అనే అంశంపై మోడీ రేపు గూగుల్ హ్యాంగవుట్ ద్వారా ప్రసంగిస్తారు.
ఈ ప్రసంగానికంటే ముందే మోడీ గూగుల్ చైర్మన్ ఎరిక్ స్మిత్ తో ముఖాముఖి సమావేశం అవుతారు. అది కూడా హ్యంగవుట్ ద్వారానే. ఈ సదస్సులో ఎంతో మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. భారత్ నుంచి ముఖ్యమంత్రిగా మోడీ ఒక్కరినే సదస్సుకు ఆహ్వానించామని గూగుల్ వెల్లడించింది.
మోడీనే ఆహ్వానించడానికి కారణం లేకపోలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనూ తర్వాత, అభిమానులతో అభిప్రాయాలు, నిర్ణయాలు పంచుకోవడానికీ మోడీ వెబ్ ప్రపంచాన్నివిస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ట్విట్టర్, గూగుల్ హ్యాంగవుట్ లాంటి ఆన్ లైన్ మాథ్యమాలను ప్రయోజనకరంగా వాడుకోవడంలో మోడీ దిట్ట. దీనిని పరిగణనలోకి తీసుకునే టెక్నాలజీ నేతకు గూగుల్ ప్రత్యేక ఆహ్వానం పలికింది.
గూగుల్ హ్యంగవుట్ అనేది సోషల్ నెట్ వర్కింగ్ వేదిక. ఆన్ లైన్లోనే అవతలి వారిని చూస్తూ ముఖాముఖి సంభాషించవచ్చు. ఏక కాలంలో ఒకరికి మించి ఎక్కువ మందితో సమావేశం కావచ్చు.