: శరద్ పవార్ ఎన్డీయే గూటికి వస్తారు: బీజేపీ నేత గోపీనాథ్ ముండే
పవార్-బీజేపీ బంధంపై వివాదం మరో మెట్టు పైకెక్కింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే తాజాగా బాంబును పేల్చారు. యూపీఏ సర్కారులో భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మోడీని రహస్యంగా కలిశారని ఇప్పటికే ఒక వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే, తన పార్టీ ఎన్డీయేలో భాగస్వామ్యం కావాలని శరద్ పవార్ కోరుకుంటున్నారని గోపీనాథ్ ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో గోపీనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తీరుపై పవార్ అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అయితే, ఎన్సీపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. గోపీనాథ్ అబద్ధాల కోరుగా ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. మహారాష్ట్ర ప్రజలకు ఆయన అబద్దాల గురించి తెలుసునన్నారు. యూపీఏతోనే కలిసి సాగాలని పార్టీ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.