: వాలెంటైన్స్ డే నాడు ఎవరైనా దొరికితే... వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేస్తాం: భజరంగ్ దళ్
ఫిబ్రవరి 14... ప్రేమికుల రోజు!
ఈ రోజు కోసం రెండు వర్గాల వారు ఎంతగానో ఎదురుచూస్తారు. ఒకరు పీకల్లోతు ప్రేమలో ఉన్నవారైతే... మరొకరు భజరంగ్ దళ్. ఒకవైపు తమ ప్రేమికులతో రొమాంటిక్ గా గడపడానికి లేదా కొత్తగా లవ్ ప్రపోజ్ చేయడానికి ప్రేమికులు సిద్ధమవుతుంటే... మరోవైపు దాన్ని అడ్డుకోవడానికి భజరంగ్ దళ్ వ్యూహరచన చేసింది. ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజును బహిష్కరిస్తున్నామని భజరంగ్ దళ్ ప్రకటించింది. అంతే కాకుండా పబ్ లు, హోటళ్లు వాలెంటైన్స్ డే సెలెబ్రేషన్స్ చేయరాదంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సహకరించాల్సిందిగా సిటీ పోలీస్ కమిషనర్ ను కోరతామని తెలిపింది. వాలెంటైన్స్ డే నాడు పెళ్లిళ్లు చేయడం తమ ఉద్దేశం కాదని... ఇటువంటివి జరుపుకోవడం మన భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని చాటిచెప్పడమే తమ లక్ష్యమని చెప్పింది. ప్రేమికుల దినోత్సవం నాడు ఏ జంట అయినా దొరికితే... వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తామని తెలిపింది.