: కృష్ణా డెల్టా ప్రాంతంలో భారీగా చమురు నిల్వలు
కృష్ణా డెల్టా ప్రాంతంలో భారీగా చమురు నిల్వలు బయటపడ్డాయి. ఓఎన్జీసీ-కెయిర్న్ ఎనర్జీ సంస్థలు సంయుక్తంగా ఎనిమిదేళ్ల పాటు చేసిన పరిశోధన విజయవంతమైంది. కృష్ణా-గోదావరి బేసిన్ లోనే ఇది ప్రతిష్ఠాత్మకమైన చమురు నిక్షేపంగా మారనుంది. 550 మిలియన్ బ్యారర్ల చమురు ఈ క్షేత్రంలో నిక్షిప్తమై ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. రాబోయే రెండు, మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభమైతే వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
కృష్ణాడెల్టాలోని నాగాయలంక-రేపల్లె క్షేత్రంలో 2011 వరకు మూడు కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే ప్రయోగాలు చేశారు. ఆ లోపు ఎప్పుడూ నిక్షేపాలు బయటపడలేదు. అనంతరం 4 కిలోమీటర్ల వరకు అంతర్జాతీయ డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా పరిశోధనలు జరిపారు. నాగాయలంకలో ప్రయోగాత్మకంగా మూడు బావులను తవ్వారు. ఈ మూడు బావుల్లో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం చమురు బ్యారల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 106 డాలర్లు ఉంది. దాని ప్రకారం, ఇక్కడి మొత్తం చమురు నిక్షేపాల విలువ ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయలు పైనే ఉంటుందని అంచనా వేశారు.