: భారత్ లో మద్యమాంసాల వ్యాపారం చేయనున్న కివీస్ కెప్టెన్
భారత్ లో క్రికెట్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ వచ్చిన తర్వాత అది మరింత పెరిగిపోయింది. స్వదేశాల్లో పెద్దగా పేరులేని క్రికెటర్లు సైతం ఐపీఎల్ పుణ్యమాని భారత్ లో హీరోలయిపోయారు. ఈ కాసుల వర్షం కురిపించే లీగ్ తో భారత్ లో బాగా పాప్యులర్ అయిన క్రికెటర్లలో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్, డానియల్ వెట్టోరీ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. భారత్ లో మద్యం, మాంసం అమ్మకాలు జరపాలని ఈ త్రయం నిర్ణయించుకుంది.
'క్వాలిటీ న్యూజిలాండ్' అనే కంపెనీ ద్వారా తమ ఉత్పత్తులను భారత్ కు ఎగుమతి చేస్తారు. ఈ సంస్థ అధిపతి కూడా ఓ క్రికెటరేనండోయ్. పేరు జెఫ్ అలాట్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సీమర్ 1999 వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవడం విశేషం. అయితే, గాయం అతని కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేసినా, తన కామర్స్ డిగ్రీతో వ్యాపారరంగంలో అడుగిడి విజయవంతం అయ్యాడు. కాగా, తమ వ్యాపారం గురించి మెకల్లమ్ మాట్లాడుతూ, న్యూజిలాండ్ లో తాము వీధుల వెంట వెళుతుంటే ఒక్కరూ గుర్తుపట్టరని, అదే, భారత్ లో అయితే బ్రహ్మరథం పడతారని వివరించాడు. అందుకే అక్కడ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నామని, తమతో వెట్టోరీ కూడా కలవడం సంతోషదాయకమని చెప్పాడు.