: కడ వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా: కేవీపీ
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వల్లే రాష్ట్రానికి దురదృష్టకరమైన రోజులు వచ్చాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందని, కాంగ్రెస్ లో నిరాశ, స్తబ్దత పెరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనా, పార్టీకి ఎలాంటి నష్టం లేదని కేవీపీ అన్నారు. దీర్ఘకాలంలో పార్టీ నిలదొక్కుకుంటుందని ఆయన చెప్పారు.
వైఎస్ మరణం తర్వాత తనను గాంధీభవన్ కు రానీయకుండా పార్టీలోని కొందరు ప్రయత్నించారని కేవీపీ చెప్పారు. కాంగ్రెస్ తనకు అన్నీ చేసిందని, గాంధీ భవన్ తనకు దేవాలయమని ఆయన అన్నారు. తాను కడవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, కాంగ్రెస్ మనిషిగానే చనిపోతానని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ లో చివరి కోరిక నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. వైఎస్, తానూ తెలిసి ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు.