: రింగురోడ్డు నిర్మాణంలో 184 కోట్ల కుంభకోణం
రింగురోడ్డు నిర్మాణంలో ఒకటి, రెండు కాదు.. ఏకంగా 184 కోట్ల కుంభకోణం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీలోని షీలాదీక్షిత్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, 2010లో రింగ్ రోడ్ బైపాస్ నిర్మాణంలో ఈ అవినీతి చోటు చేసుకుంది. ఈ స్కాంపై ఏసీబీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. దీంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణను ప్రారంభించింది. ఈ కుంభకోణంలో మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ పాత్రను కూడా శోధించనున్నారు.
ఢిల్లీలోని సాలింగఢ్ కోట నుంచి వెలోడ్రమ్ రోడ్డు వరకు నిర్మించిన రింగురోడ్డులో అవకతవకలు జరిగాయని ప్రధాని నియమించిన షుంగ్లు కమిటీ తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా చేసి ప్రైవేటు కాంట్రాక్టర్లను అప్పగించారు. రింగు రోడ్డు మొత్తం విలువ 407 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులో సామగ్రితో పాటు కూలీల ఖర్చును కూడా కాంట్రాక్టర్లు ఎక్కువ చేసి చూపించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు 184 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు జరపాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది.