: ఆవు పాలను పితకడం ఎలా..?: జర్మనీ అధ్యక్షుడి ఆసక్తి
ఆయన ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఒక దేశానికి అధ్యక్షుడు. వయసు 74ఏళ్లు. కానీ, ఆవు పాలను పితకడం ఎలా? అన్నది ఆయనకు తెలియదు. పాడికి పుట్టినిల్లయిన భారత్ కు వచ్చాడు. ఆవు పాలను పితకడం ఎలానో దగ్గరుండి చూసి మరీ తెలుసుకున్నాడు. ఓ చిన్న పిల్లాడిలా తన ముచ్చటను తీర్చుకున్నాడు.
ఇంతకీ ఆయనెవరో కాదు. జర్మనీ అధ్యక్షుడు జోచిమ్ గౌక్! ఆరు రోజుల భారత పర్యటన కోసం 80 మంది ప్రతినిధులతో గౌక్ విచ్చేశారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా ముద్దపూర్ గ్రామానికి వెళ్లారు. బాబ్బాబు.. ఆవు పాలను ఎలా ఇస్తాయి.. ఎలా పితుకుతారో కాస్త చూపించరూ? అని అడిగారు. హళ్లిర్, హోల్ స్టీన్ ఫ్రీసన్ అనే రెండు రకాల ఆవులను గ్రామస్థులు తీసుకొచ్చారు. హళ్లికర్ రోజుకు రెండు లీటర్ల వరకు పాలను ఇస్తుంది. ఫ్రీసన్ అయితే 20లీటర్ల వరకు ఇస్తుంది. పెద్దాయన గౌక్, ఆయన వెంట ఉన్న ప్రతినిధులు కుర్చీల్లో కూర్చున్నారు. ఒక్కో ఆవు నుంచి పాలను పితుకుతుంటే ఆసక్తిగా, ఆనందంగా వీక్షించారు. గ్రామస్థులు మాత్రం వారిని వింతగా చూశారులేండి. ఇక్కడి నుంచి గౌక్ శుక్రవారం బెంగళూరుకు వెళ్లిపోయారు. శనివారం ఇన్ఫోసిస్ క్యాంపస్ ను సందర్శిస్తారు.