: రాష్ట్ర విభజనలో కీలక అడుగు
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ప్రధాని నివాసంలో సమావేశమై సుమారు రెండు గంటల పాటు ముసాయిదా బిల్లుపై చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ముసాయిదా బిల్లును సీమాంధ్ర ప్రాంత మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. విభజన అంశంపై కావూరి అరగంట సేపు మాట్లాడగా, పళ్లంరాజు పదిహేను నిమిషాల సేపు మాట్లాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కావూరి, పళ్లంరాజు వాదించారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు కూడా ప్యాకేజీ కావాలని వారు అడిగారు.
న్యాయపరమైన ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు శాసనసభకు పంపిన బిల్లునే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత అధికారికంగా బిల్లుకు అవసరమైన సవరణలను చేయనున్నారని తెలిసింది. పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాతే, ప్రత్యేక రాజధానిని ఎంపిక చేయాలని కూడా ఈ భేటీలో నిర్ణయించారు. హైదరాబాద్ ను యూటీ చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర కేబినేట్ అంగీకరించలేదు.