: 'ఆమ్ ఆద్మీ' గాడి తప్పుతోందంటున్న యోగా గురు
ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో సంచలనం విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గాడి తప్పుతున్నట్టు కనిపిస్తోందని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ అన్నారు. తొలినాళ్ళలో కాంగ్రెస్ ను తూర్పారబట్టి ఇప్పుడు వారితోనే పొత్తు కుదుర్చుకుందని విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ చీపురును కాంగ్రెస్ చేతిలో పెట్టిందని, దాని ఫలితాలు మున్ముందు కనిపిస్తాయని రాందేవ్ హెచ్చరించారు. అవినీతి వ్యతిరేక పోరాటాలు, వ్యవస్థలో సమూల మార్పులు వంటి అంశాలను పక్కనబెట్టిన ఆ పార్టీ, అందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తాను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతుగా ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని ఆరంభిస్తానని తెలిపారు.