: 'ఏయ్.. నన్నే ఆపుతావా..' ?: ఏఎస్సైని చితకబాదిన ఎమ్మెల్యే
కొందరు అధికారం చేతిలోకి రాగానే ఉచితానుచితాలు మరిచిపోతారు. తమలో నిద్రాణంగా ఉన్న జంతు ప్రవృత్తికి ప్రాణం పోస్తారు. అహంకారంతో ఎదుటివాళ్ళపై దౌర్జన్యానికి తెగబడతారు. మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే ఈ కోవకు చెందినవాడే. ఆయన పేరు క్షితిజ్ ఠాకూర్.
శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వెళ్ళే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించాడు. వాహనంలో వేగంగా వెళుతుండడంతో సచిన్ సూర్యవంశీ అనే ఏఎస్సై క్షితిజ్ ను అడ్డగించి జరిమానా విధించాడు. దీంతో, ఎమ్మెల్యే గారికి చిర్రెత్తుకొచ్చింది. అదే విషయాన్ని సభలో స్పీకర్ కు ఫిర్యాదు చేశాడు. తనతో ఏఎస్సై దురుసుగా ప్రవర్తించాడని చెప్పాడు.
కాసేపటి తర్వాత ఆ ఏఎస్సై శాసనసభ వద్ద కనిపించేసరికి ఎమ్మెల్యేలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆ యువ పోలీసును చితకబాదాడు. పాపం, ఆ ఏఎస్సై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.