: గుజరాత్ పాఠ్యపుస్తకాల్లో ఘోరమైన అచ్చుతప్పులు
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాల్లో ఘోరమైన అచ్చుతప్పులు దొర్లాయి. మచ్చుకు వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే.. అవెంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ 1948 అక్టోబర్ 30న హత్యకు గురయ్యాడట, రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ దేశం అమెరికాపై అణుబాంబులు వేసి నేలమట్టం చేసిందట. 8వ తరగతి ఇంగ్లిష్ మీడియం సాంఘిక శాస్త్రం పుస్తకంలో కనిపించిన తప్పులివి. వాస్తవానికి గాంధీ 1948 జనవరి 30న నేలకొరగగా.. అమెరికానే జపాన్ పై అణుబాంబులు వేసి విలయం సృష్టించింది. ఈ పొరబాట్లపై గుజరాత్ రాష్ట్ర పాఠ్యపుస్తకాల బోర్డు అధ్యక్షుడు నితిన్ పేథాని మాట్లాడుతూ, అలాంటి పుస్తకాలు వెనక్కి తీసుకుని, సవరణలతో నూతన ముద్రణ చేపడతామని వివరణ ఇచ్చారు.