: అతిథిగా రావాలంటూ సత్య నాదెళ్లకు సొంత యూనివర్శిటీ ఆహ్వానం!
మైకోసాఫ్ట్ సీఈవోగా నియమితులయిన సత్య నాదెళ్ల త్వరలో ఆయన చదువుకున్న సొంత యూనివర్శిటీకి ప్రత్యేక అతిథిగా వెళ్లనున్నారు. ఈ మేరకు ఆ యూనివర్శిటీ వారే సత్యను పిలవాలనుకుంటున్నట్లు తెలిపారు. 1984-1988లో కర్ణాటకలోని ఉడిపి దగ్గర్లో ఉన్న మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో ఆయన చదవుకున్నారు. దాంతో, తమ వద్ద చదువుకున్న విద్యార్థి ఈ రోజు ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థకు సీఈవో కావడంతో విశ్వవిద్యాలయం గర్వంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జరిగే వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ మేరకు మణిపాల్ విశ్వవిద్యాలయ డైరెక్టర్ వినోద్ థామస్ మాట్లాడుతూ, 'గొప్ప విజయాన్ని సాధించినందుకు సత్యకు మా శుభాకాంక్షలు. ప్రస్తుతం నీవు చేస్తున్న పనిని అలాగే కొనసాగించాలి. మణిపాల్ విశ్వవిద్యాలయంలో మేమంతా త్వరలో నిన్న చూడాలనుకుంటున్నాం. స్నాతకోత్సవానికి అతిథిగా తప్పకుండా రావాలని కోరుతున్నాము' అని పేర్కొన్నారు.
అయితే, సత్య ఎప్పుడూ అలర్ట్ గా, కష్టపడే విద్యార్థిగా కనిపించేవాడని అన్నారు. విజ్ఞానం కోసం ఎప్పుడూ అతను ఆకలిగా చూస్తున్నట్లు కనిపించేవాడని, ల్యాబ్ లో పలుసార్లు సత్యను గమనించే వాడినని అలనాటి సంఘటనలను మణిపాల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత తరాలవారికి ఎంతోమందికి సత్య స్పూర్తిదాయకమని అన్నారు.